

సినిమా పరిశ్రమలో హీరోలకు భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాం. అయితే హీరోయిన్లకూ అదే స్థాయిలో అభిమానుల నుంచి గుర్తింపు, గౌరవం దక్కాలని నటి రెజీనా అభిప్రాయపడ్డారు. నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్-2’ (తెలుగులో ‘మహాశక్తి’) విడుదల సందర్భంగా ఆమెకు 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడంపై రెజీనా హర్షం వ్యక్తం చేశారు. గతంలో హీరోలకే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు కథానాయికలకూ విస్తరించడం పరిశ్రమలో మంచి మార్పు అని పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర హీరోలకే భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారని, హీరోయిన్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదని అన్నారు. నయనతారకు భారీ కటౌట్ ఏర్పాటు చేసిన తర్వాత ‘తాయ్ కిళవి’ సినిమా కోసం సీనియర్ నటి రాధికకు కూడా అలాంటి గుర్తింపు లభించిందని తెలిపారు. ‘మూకుత్తి అమ్మన్-2’లో తొలిసారిగా భారీ కమర్షియల్ చిత్రంలో ప్రతినాయికగా నటించే అవకాశం వచ్చిందని రెజీనా చెప్పారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తానన్నారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, ఊర్వశి, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!