

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మరో మూడు రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ‘రణబాలి’ రాబోతోందని, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో కలిసి మాస్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంతో కూడిన పీరియడ్ కథను తెరకెక్కించామని తెలిపారు.
ఈ సినిమా చరిత్రలో దాగిన కీలక అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని విజయ్ పేర్కొన్నారు. ఎల్నినో, బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న దారుణాల నేపథ్యంలో నీరు, విద్యుత్తు, ఆహారాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలని ఆయన సూచించారు. రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘రణబాలి’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, సినిమా కోసం నటీనటులు, సాంకేతిక బృందం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇందులో విజయ్తో తనకు అందమైన ప్రేమకోణం ఉంటుందని వెల్లడించారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ఆకలి, ఆహారం చుట్టూ తిరిగే కథ ద్వారా దేశ చరిత్రలోని కీలక అంశాలను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఇందులో విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!