

నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. దిల్లీకి చెందిన శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి లేఖ రాస్తూ, సినిమా థియేటర్లలో విడుదలకు ముందు తమ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరారు. హిందూ మత విశ్వాసాలు, మనోభావాలకు భంగం కలిగించే సన్నివేశాలు లేదా సంభాషణలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. టీజర్, ట్రైలర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు, పాత్రల వస్త్రధారణ, భావోద్వేగాల ప్రదర్శన తమకు పూర్తిగా సంతృప్తికరంగా అనిపించలేదని పేర్కొన్నారు.
గతంలో ‘ఆదిపురుష్’ చిత్రం విడుదల సమయంలో నెలకొన్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అర్జున్ కుమార్ వెల్లడించారు. సినిమాలో అభ్యంతరకర అంశాలు ఉన్నాయనే సమాచారం తమకు అందిందని, విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తమ విజ్ఞప్తిని చిత్ర బృందం పట్టించుకోకపోతే, సినిమా విడుదల అనంతరం థియేటర్ల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘రామాయణం: పార్ట్–1’ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!