

తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉండటంతో దాని ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.
సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, జనగామ, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై నీరు నిలిచే పరిస్థితుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!