

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా పెన్ స్టేట్ ఫిల్మ్‌మేకింగ్ విద్యార్థులతో ఇటీవల రాజమౌళి సంభాషించారు. ఈ సందర్భంగా నటుల ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కేవలం ఒక నటుడు సూపర్ స్టార్ అనే కారణంతో తాను ఎంపిక చేసుకోనని, పాత్రకు నిజంగా సరిపోయే నటుడినే ఎంచుకుంటానని చెప్పారు. నటుడిని ఎంపిక చేసిన తర్వాత, తనపై నమ్మకం ఉంచాలని ఆశిస్తానని, పాత్రకు అవసరమైన నటనను రాబట్టేందుకు తాను మార్గనిర్దేశం చేస్తానని తెలిపారు.
మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ ‘వారణాసి’ కోసం ఆయన నుంచి 100 శాతం ప్రతిభను ఆశించానని, అయితే కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత తన అంచనాలను మహేశ్ పూర్తిగా మించిపోయారని రాజమౌళి చెప్పారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువగా, 200 శాతం పనితీరును అందించారని ప్రశంసించారు. పాత్రకు మహేశ్ తీసుకొచ్చిన కొత్త కోణాలు తనను ఆశ్చర్యపరిచాయని, ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా పాత్రను పండించారని అన్నారు. అందుకే ‘వారణాసి’లో మహేశ్ బాబుతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవంగా మారిందని రాజమౌళి పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!