

సినిమా వసూళ్లను ప్రకటించే విధానంపై నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఇటీవల ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటూ చిత్రబృందం పోస్టర్ విడుదల చేయగా, దానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ, అభిమానులను ఆకట్టుకునేందుకు కలెక్షన్ పోస్టర్లలో వసూళ్లను కొంత ఎక్కువగా చూపించడం పరిశ్రమలో సాధారణమేనని అన్నారు. ఒక సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తే పోస్టర్‌పై రూ.110 కోట్లు చూపించే అవకాశం ఉంటుందని, అయితే రూ.200 కోట్లు వచ్చినట్లు మాత్రం చెప్పరని వివరించారు. అసలు వసూళ్ల లెక్కలు జీఎస్టీ, టీడీఎస్, బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా ప్రభుత్వ శాఖలకు తెలుస్తాయని పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులపై కూడా నాగవంశీ మాట్లాడారు. గతంతో పోలిస్తే ఓటీటీ, శాటిలైట్, ఆడియో, హిందీ మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, అదే సమయంలో సినిమాల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీంతో నిర్మాతలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. ‘లెనిన్’ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందంటూ విడుదలైన పోస్టర్‌పై ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాగవంశీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కలెక్షన్ పోస్టర్లలో పేర్కొనే సంఖ్యలు, వాస్తవ లెక్కల మధ్య ఉండే వ్యత్యాసంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!