

అక్కినేని కోడలు, నటి శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం వరుస అవకాశాలతో తన కెరీర్‌లో మరో దశను ప్రారంభిస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘వెట్టువం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న శోభిత.. కేవలం 16 ఏళ్ల వయసులోనే వైజాగ్ నుంచి బ్యాగ్ సర్దుకుని కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని, ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధమై ఆ అడుగు వేశానని చెప్పారు. మోడలింగ్, నటనపై ఉన్న ఆసక్తే చిన్న వయసులోనే సొంతూరిని విడిచిపెట్టేలా చేసిందని పేర్కొన్నారు.
తన ప్రయాణంలో తల్లిదండ్రులు అందించిన మద్దతు, స్వేచ్ఛ, ధైర్యం ఎంతో కీలకమని శోభిత తెలిపారు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం భిన్నంగా ఉంటుందని, అందరి గమ్యాలు ఒకేలా ఉండవని పేర్కొన్నారు. మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని భయపడకుండా ముందుకు సాగాలని సూచించారు. సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం లేదా రూ.1,000 కోట్ల వసూళ్లు సాధించే సినిమాల్లో భాగం కావడమే విజయానికి కొలమానం కాదని అన్నారు. బాక్సాఫీస్ రికార్డుల కంటే నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం, తాను నమ్మిన విలువలకు కట్టుబడి నిజాయితీగా ప్రయాణించడమే తన దృష్టిలో నిజమైన విజయమని శోభిత స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!