

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘అభయ హస్తం’ మ్యానిఫెస్టో పచ్చి అబద్ధాల సమాహారమని ఆరోపించారు. బీసీల కోసం రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి.. మూడేళ్లలో రూ.5 వేల కోట్లలోపే ఖర్చు చేశారని విమర్శించారు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం వాటా కల్పిస్తామన్న హామీని అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల అంబేడ్కర్ అభయహస్తం పథకం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వారికి 31 శాతం వాటా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు హామీలు కూడా నెరవేరలేదని పేర్కొన్నారు. 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10 వేల కొలువులే కల్పించారని విమర్శించారు. మైనార్టీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి.. రూ.వెయ్యి కోట్లలోపే నిధులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!