

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గా తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరందుకుంది. ఇప్పటికే పలుమార్లు ఆయన పెళ్లిపై వార్తలు వచ్చినప్పటికీ.. ఈసారి మాత్రం నిశ్చితార్థం, వివాహ తేదీలకు సంబంధించిన వివరాలు తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 5న హైదరాబాద్‌లో సాయిదుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు మెగా కుటుంబ సభ్యులు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌లో హైదరాబాద్‌లోనే వివాహ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇక సాయిదుర్గా తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఆయన తన చిరకాల స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం ఒకవైపు, పెద్దలు కుదిర్చిన సంబంధమనే వార్తలు మరోవైపు వినిపిస్తున్నాయి. అయితే వధువు వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలోనే 2026లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సాయిదుర్గా తేజ్ సంకేతాలిచ్చారని, ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పెళ్లి వార్తలపై సాయిదుర్గా తేజ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!