

ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన కొందరు యువకులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఏజెంట్ గంగరాజు ద్వారా ఐదుగురు యువకులు రష్యా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న సమయంలో ఓ నేపాల్ వ్యక్తి సూచనతో రష్యా సైన్యంలో చేరినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే, తమను బలవంతంగా సైన్యంలో చేర్చడమే కాకుండా యుద్ధ క్షేత్రంలోకి పంపిస్తున్నారని వంశీ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదుగురిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారని అతడు తన తల్లికి పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
తనకు ఇదే చివరి వీడియో కావచ్చని, తనను కాపాడాలని తల్లికి వంశీ పంపిన సందేశం కుటుంబ సభ్యులను కలచివేసింది. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వంశీ తల్లి కోరుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని తమ కుమారుడిని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!