

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన నటనతోనే కాకుండా, జీవితంపై తనకున్న దృక్పథంతోనూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. 2012లో యేల్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఎన్ని కష్టాలు ఎదురైనా మన అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని సూచించారు. ప్రపంచం మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనల్ని మనం గుర్తించి, మన విలువలను కాపాడుకోవాలని చెప్పారు. 2015లో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగంలోనూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే అయోమయం కొత్త ఆలోచనలకు దారితీస్తుందని, ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. ఇతరులకు సాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, అపజయాల నుంచే విలువైన పాఠాలు నేర్చుకుంటామని వివరించారు. డబ్బు, పేరు కంటే మానవ సంబంధాలు, దయ, మంచితనమే ముఖ్యమని తన మాటలతో గుర్తుచేశారు.
మరోవైపు, షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం మన్నత్ వద్ద అభిమానులు సందడి చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు చేతిరాతతో ప్రత్యేక సందేశం పంపిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమకు అదే ప్రేమను తిరిగి అందిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన తదుపరి చిత్రం ‘కింగ్’ నుంచి ప్రత్యేక విజువల్స్, డైలాగ్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారుఖ్‌తో పాటు సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుట్టినరోజు వేళ తన జీవిత అనుభవాలతో స్ఫూర్తినిస్తూనే, కొత్త సినిమా అప్‌డేట్‌తో అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు షారుఖ్.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!