

కోలీవుడ్ స్టార్ సూర్య, ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జీతు మాధవన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘సీన్’పై అంచనాలు పెరుగుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత నటి నజ్రియా ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, యువ నటుడు నస్లెన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు జీతు మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీజర్, ట్రైలర్‌లో సినిమాలోని సన్నివేశాల్లో కేవలం 30 శాతం మాత్రమే చూపిస్తామని, కీలకమైన ట్విస్టులను ముందుగానే వెల్లడించబోమని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో మొత్తం 13 పాటలు ఉన్నప్పటికీ, కథలోని రహస్యాలు బయటపడకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని జీతు మాధవన్ వెల్లడించారు. ప్రేక్షకులకు థియేటర్లలోనే అసలైన అనుభూతి కలగాలని ఆయన పేర్కొన్నారు. నస్లెన్ ఎంపిక గురించి మాట్లాడుతూ, నేరాలకు పాల్పడుతున్నప్పటికీ అమాయకంగా కనిపించే ముఖం ఉన్న నటుడు కావాలని, ఆ పాత్రను నస్లెన్ లోతుగా అర్థం చేసుకున్నాడని ప్రశంసించారు. నజ్రియా సహజమైన కామెడీ టైమింగ్ సినిమాకు బలమని చెప్పారు. అలాగే సూర్య కర్లీ హెయిర్ లుక్ వెనుక కథకు సంబంధించిన కీలకమైన మిస్టరీ ఉందని, ఆయన గతంలో పోషించిన ‘అన్బుసెల్వన్’, ‘సింగం’ పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!