

పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని రాయగడ పట్టణానికి చెందిన ఇప్పిలి సాయిశ్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రాయగడ, గుణుపూర్ ప్రాంతాల్లో ఆమె పోటీపై ఆసక్తి నెలకొంది. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆమె గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం. సాయిశ్రీ కుటుంబం రాయగడలోని న్యూకాలనీలో నివసిస్తోంది. ఆమె తండ్రి స్వర్గీయ ఇప్పిలి మోహనరావు రాయగడలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వివాహం అనంతరం పార్వతీపురంలో స్థిరపడిన సాయిశ్రీ, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సాయిశ్రీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటీ చేస్తుండటంతో రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన బంధువులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. పలువురు పార్వతీపురం వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. రాయగడ జిల్లా కళింగవైశ్య సంఘం అధ్యక్షుడు కింతలి అమర్‌నాథ్, మజ్జిగౌరమ్మ మందిరం ట్రస్టు సభ్యుడు ఇప్పిలి సన్యాసిరాజు, కొత్తకొట నరీన్ కుముంధాన్‌లు కూడా ఆమె విజయానికి కృషి చేస్తామని తెలిపారు. పార్వతీపురంలోని తమ బంధువులను ఫోన్ ద్వారా సంప్రదించి, సాయిశ్రీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!