

నటి కీర్తి సురేశ్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్ ‘అక్క’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి తన రచనా ఆసక్తి గురించి వెల్లడించారు. గత రెండేళ్లుగా కథలు రాస్తున్నానని, తన ప్రయత్నాలు త్వరలోనే ఒక స్పష్టమైన రూపం దాల్చుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. అయితే, తాను రాస్తున్న కథలు ఏ జానర్‌కు చెందినవో ఆమె వెల్లడించలేదు. సరైన ప్రణాళిక లేకుండా కేవలం దర్శకురాలిగా మారుతున్నానని ప్రకటించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.
“ప్రస్తుతం ఏదీ వెంటనే రావడం లేదు. కానీ మంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదో చెప్పాలని దర్శకత్వం వహిస్తున్నానని ప్రకటించాలనుకోవడం లేదు. అయితే, నేను రాస్తున్నాను. రచనపై నాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. అది నా సొంత ప్రాజెక్ట్ కోసమేనా అనేది ఇంకా తెలియదు” అని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. తన తోటి నటీమణుల మాదిరిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా అని అడగగా, భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రణాళిక లేదని చెప్పారు. నష్టపోయినా భరించగలిగే ఆర్థిక స్థితికి చేరుకున్న తర్వాతే నిర్మాణం గురించి ఆలోచిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!