

అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో శ్రీలీల స్థానంలో కయాదు లోహర్‌ను తీసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ సినిమా తారాగణం, షూటింగ్ వివరాలపై స్పందించారు. శ్రీలీల, ప్రభు, పార్తిబన్, సునీల్ ఈ సినిమాలో భాగమని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, మలేషియా, బ్యాంకాక్‌లలో చిత్రీకరణ జరగనుందని తెలిపారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి భిన్నంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రంగా ‘డేర్ డెవిల్’ను రూపొందిస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు.
ఈ సినిమాకు ‘డేర్ డెవిల్’ అనే టైటిల్‌ను అజితే సూచించారని అధిక్ రవిచంద్రన్ తెలిపారు. చెన్నైలో వర్షాల పరిస్థితి అనిశ్చితంగా ఉండటంతో, సినిమాలోని భారతదేశానికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. దీపావళి తర్వాత నవంబర్ 12 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అజిత్ భార్య షాలిని అజిత్‌కుమార్ తన ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతగా ఆమెకు ఇదే తొలి సినిమా. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. హీరోయిన్ విషయంలో వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సినిమా తాజా వివరాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!