

ఆదిసాయికుమార్ హీరోగా నటించిన శంబాల ఈ నెల 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం చిత్ర బృందానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. వేదికపై ఆది తండ్రి సాయికుమార్ తో తనకున్న అనుబంధాన్ని కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, శంబాల సినిమా గురించి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని, ఆదికి ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితంగా తెలిసిన సీనియర్ నటుడు సాయికుమార్ గారేనని చెప్పారు. తన కెరీర్లో కీలకమైన ఎస్ ఆర్ కల్యాణమండపం చిత్రంలో ఆయన నటించడం తన ఎదుగుదలకు ప్రధాన కారణమైందన్నారు. ఆ సినిమా ఫలితం ఆయన లేకపోతే ఎలా ఉండేదో ఊహించలేనని, అప్పటి నుంచి ప్రతి సినిమాకు సాయికుమార్ గారు తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని తెలిపారు.
విజయం లేదా పరాజయం కంటే క్రమశిక్షణే ముఖ్యమని సాయికుమార్ గారు తనకు ఇచ్చిన సలహాలు కెరీర్లో ఎంతో ఉపయోగపడ్డాయని కిరణ్ అన్నారు. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకునే మనసున్న వ్యక్తి సాయికుమార్ గారని, అందుకే ఆయన పిలిస్తే ప్రతి ఒక్కరూ ఈవెంట్కు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రేమకావాలి సినిమా సమయంలో తాను బీటెక్ చదువుతున్న రోజులను గుర్తు చేస్తూ, ఆ సినిమా పాటలకు డ్యాన్స్ చేయని విద్యార్థి లేడని చెప్పారు. దాదాపు 14 ఏళ్లుగా ఆది అన్న నిరంతరం ప్రయత్నాలు చేస్తూ సినిమాల్లో కొనసాగడం గొప్ప విషయమని, హిట్లు సాధించడం ఒకెత్తు అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో ఎత్తు అని వ్యాఖ్యానించారు. చివరగా శంబాల సినిమా ఘన విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!