

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి భారతీయ ఇతిహాసాలను వెండితెరపై తెరకెక్కించే విధానంపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో క్లాసిక్ పౌరాణిక చిత్రాలు తనకు ఇష్టమైనప్పటికీ, గొప్ప ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు గ్రంథాల్లోని లోతైన భావాలను, వాటి గొప్పతనాన్ని సినిమాల్లో చూపించే విధానంలో చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఈ అంశం తనను ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేసిందని, చివరకు దాన్ని ఒక సవాల్‌గా స్వీకరించానని తెలిపారు. ఇతిహాసాలను విభిన్నంగా ఎలా చూపించాలనే ఆలోచనే మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకు ప్రధాన ప్రేరణగా నిలిచిందని రాజమౌళి వెల్లడించారు.
వారణాసి సినిమాలో రామాయణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి గతంలో వెల్లడించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇదే సందర్భంగా తన కెరీర్‌లో ఈగ సినిమా ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు. ఒక ఈగను ప్రధాన పాత్రగా తీసుకుని సినిమా రూపొందించడం తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రయోగమని, ఆ చిత్రం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. సాధారణంగా తన కెరీర్‌ను బాహుబలికి ముందు, తర్వాత అని విభజిస్తారని, కానీ వ్యక్తిగతంగా తాను మాత్రం ఈగకు ముందు, తర్వాత అనే కోణంలో తన ప్రయాణాన్ని చూస్తానని రాజమౌళి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!