

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవితం ఎన్నో కష్టాలు, పోరాటాలు, విజయాలతో కూడిన స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తండ్రి, సినీ సంగీత దర్శకుడు ఆర్.కే. శేఖర్ తొమ్మిదేళ్ల వయసులోనే మరణించడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్న వయసులోనే రెహమాన్ రికార్డింగ్ స్టూడియోల్లో చిన్నచిన్న పనులు చేసేవారు. పని ఒత్తిడి కారణంగా తరచూ పాఠశాలకు వెళ్లలేక చదువులో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో పాఠశాల అధికారులు ఆయన తల్లి కరీమా బేగంను పిలిపించి, చదువు కొనసాగించలేని పరిస్థితి ఉంటే వీధుల్లో భిక్షాటన చేసుకోవాలని కఠినంగా వ్యాఖ్యానించినట్లు మసాలా! కథనం పేర్కొంది.
అయితే, నేడు ఏఆర్ రెహమాన్ భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వివిధ మీడియా సంస్థల అంచనాల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు రూ.1,728 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. సినిమాలకు సంగీతం అందించడం, అంతర్జాతీయ సంగీత కచేరీలు, మ్యూజిక్ రాయల్టీలు, విదేశాల్లో స్టూడియో వ్యాపారాల ద్వారా ఆయన ఈ స్థాయికి చేరుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను 2009లో రెండు ఆస్కార్ అవార్డులు, 2010లో రెండు గ్రామీ అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2000లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆయనను గౌరవించింది. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!