

భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా నిలిచిన హోంబాలే ఫిల్మ్స్ అంతర్జాతీయ వేదికపై మరో ఘనతను సాధించింది. 2025 లో విడుదలైన మహావతార్ నరసింహ మరియు కాంతారా: చాప్టర్ 1 చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో అధికారికంగా చోటు దక్కించుకోవడంతో ఇది భారతీయ సినిమాకు గర్వకారణంగా మారింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన కాంతారా: చాప్టర్ 1, అలాగే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబాలే ఫిల్మ్స్ సమర్పించిన మహావతార్ నరసింహ చిత్రాలు కథన బలం, సాంస్కృతిక లోతు, సాంకేతిక ప్రతిభతో విస్తృత ప్రశంసలు అందుకున్నాయి.
జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చేరడంతో ఈ రెండు చిత్రాలు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన ఆస్కార్ విభాగాల్లో పరిశీలనకు అర్హత పొందాయి. ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కిన ఐదు భారతీయ చిత్రాల్లో రెండూ హోంబాలే ఫిల్మ్స్వే కావడం విశేషం. ఇది భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా హోంబాలే ఫిల్మ్స్ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!