

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన ట్రెండ్ కొనసాగుతోంది. కెమెరా వెనుక ఉండి నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టే దర్శకులు.. ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. లోకేశ్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్, ఎస్.జే. సూర్య, సుందర్ సీ, చేరన్, తరుణ్ భాస్కర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మానగరం, ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి చిత్రాలతో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ తాజాగా నటుడిగానూ అడుగులు వేస్తున్నారు. కోమలితో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్.జే. సూర్య దర్శకత్వంతో పాటు విభిన్న పాత్రలతో నటుడిగా మెప్పిస్తున్నారు. సుందర్ సీ, చేరన్ కూడా దర్శకులుగా విజయాలు సాధించిన తర్వాత నటులుగా ప్రేక్షకులను అలరించారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్.. మీకు మాత్రమే చెప్తా, కీడా కోలా వంటి చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు.
ఇక మరోవైపు హీరోలుగా పేరు తెచ్చుకున్న పలువురు దర్శకులుగానూ తమ ప్రతిభను చాటారు. అర్జున్ సర్జా సేవగన్తో దర్శకత్వంలో అడుగుపెట్టగా.. డ్యాన్స్, నటనతో క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో దర్శకుడిగా మారారు. రాఘవ లారెన్స్ మాస్తో దర్శకత్వం చేపట్టి, అనంతరం కాంచన ఫ్రాంచైజ్‌తో నటుడు, రచయిత, దర్శకుడిగా విజయాలు అందుకున్నారు. కమల్ హాసన్ హే రామ్, విశ్వరూపం వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ నటుడిగానూ మెప్పించారు. టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇలా నటన, దర్శకత్వం రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తున్న ఈ సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!