

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు వరుణుడు వరుసగా రెండో రోజు కూడా అడ్డంకిగా మారాడు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మధ్యాహ్నం వైజాగ్ ఫైర్ బర్డ్స్, రాయలసీమ జెన్ స్టార్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అనంతరం సాయంత్రం అమరావతి ఈ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. దీంతో నాలుగు జట్లకు చెరో పాయింట్ లభించింది. రాయలసీమ, అమరావతి, గోదావరి జట్లు ఆరేసి పాయింట్లతో ఉండగా.. నెట్ రన్‌రేట్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ (+0.643) అగ్రస్థానంలో ఉంది. అమరావతి (+0.383), గోదావరి (-0.164) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన వైజాగ్ ఫైర్ బర్డ్స్ రెండు పాయింట్లతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. లీగ్ దశలో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. మధ్యాహ్నం గోదావరి గోల్డెన్ ఈగల్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్‌తో తలపడనుండగా.. సాయంత్రం రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఈ ఛాంపియన్స్ ఢీకొననున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌లు రద్దయితే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాయలసీమ, అమరావతి జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!