

థియేటర్, ఓటీటీ విడుదల విండోపై వివాదం తీవ్రం కావడంతో తమిళ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠంభన పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలతో పాటు షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయించాయి. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే సినిమాలను ఓటీటీలోకి తీసుకురావాలని థియేటర్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిబంధనకు లిఖితపూర్వక హామీ ఇచ్చిన నిర్మాతల సినిమాలనే థియేటర్లలో ప్రదర్శిస్తామని ప్రకటించాయి.
అయితే స్టేక్హోల్డర్లతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఇలాంటి నిబంధనలు లేవని వారు పేర్కొన్నారు. సమస్యను తమిళనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రతిష్ఠంభన కొనసాగితే సెప్టెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై ప్రభావం పడటంతో పాటు నిర్మాతలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. అయితే చర్చల ద్వారా త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని థియేటర్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!