

భారతీయ సంగీత రంగంలో ఏఆర్ రెహమాన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆస్కార్ వేదికపై ‘జై హో’తో భారత కీర్తిని ప్రపంచానికి చాటిన ఆయన, ఇటీవల బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. హిందీ చిత్ర పరిశ్రమలో గత ఎనిమిదేళ్లుగా ‘పవర్ షిఫ్ట్’ జరిగిందని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో అధికారం ఉందని రెహమాన్ అన్నారు. ఈ మార్పులకు మతపరమైన అంశం కూడా ఒక కారణం కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తనకు నేరుగా వివక్ష ఎదురుకాలేదని, కానీ గుసగుసల రూపంలో అలాంటి మాటలు విన్నానని చెప్పారు. తాను అవకాశాల కోసం తిరిగే వ్యక్తిని కాదని, నిజమైన నిబద్ధత ఉంటే పని తననే వెతుక్కుంటూ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ షాన్ స్పందిస్తూ, అవకాశాలు తగ్గడానికి మతాన్ని కారణంగా చెప్పడం సరికాదన్నారు. తనకు కూడా ప్రస్తుతం అవకాశాలు లేవని, కానీ దాన్ని వివక్షగా చూడలేమని చెప్పారు. బాలీవుడ్లో ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందని, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. మరోవైపు రచయిత్రి శోభా డే రెహమాన్ వ్యాఖ్యలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించగా, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మాత్రం రెహమాన్ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని అన్నారు.
ఈ వివాదం రాజకీయ రంగానికి కూడా విస్తరించింది. వీహెచ్‌పీ నేత వినోద్ బన్సాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, నెటిజన్లు మాత్రం ఒక కళాకారుడికి మతం కాదు, ప్రతిభే అసలు ప్రమాణం కావాలని అభిప్రాయపడుతున్నారు. కొందరు రెహమాన్ ఆవేదనలో నిజం ఉందంటుండగా, మరికొందరు కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారడం వల్ల సీనియర్లకు అవకాశాలు తగ్గడం సహజమని అంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!