

అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన హాస్య ప్రధాన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రాగా, తాజాగా వచ్చిన టీజర్ కథపై ఆసక్తిని పెంచింది. మాయా పుస్తకం ద్వారా ఇంద్రలోకానికి ద్వారాలు తెరుచుకుంటాయని, దాని సాయంతో రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి తీసుకురావచ్చని టీజర్‌లో చూపించారు. ఈ విషయం నమ్మిన నరేష్ పాతికేళ్లుగా దేవకన్యల కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు వారు భూమిపైకి రావడంతో అతని జీవితంలో గందరగోళం మొదలవుతుంది.
గ్రామీణ నేపథ్యంలో దేవకన్యలు అడుగుపెడితే ఎదురయ్యే పరిణామాలను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా కనిపించనున్నారు. సురభి కథానాయికగా నటించగా, రాశి సింగ్ రంభగా, విష్ణుప్రియ ఊర్వశిగా, ప్రిషా సింగ్ మేనకగా కనిపిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. అల్లరి నరేష్‌ను మళ్లీ పూర్తి హాస్య పాత్రలో చూడబోతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!