

సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఓ ఇంధన నౌకను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా పైరేట్లు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ పౌరుడు ఉన్నారు. మరో భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎంటీ ఆనర్ 25’ అనే ఈ నౌకను 18,500 బారెళ్ల ఇంధనంతో మొగాదీషు వైపు వెళ్తుండగా ఏప్రిల్ 21న సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు.
నౌకను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పుంట్‌ల్యాండ్ మారిటైమ్ పోలీస్ ఫోర్స్ మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బలగాలు నౌకను చుట్టుముట్టినట్లు గుర్తించిన పైరేట్లు సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఐదుగురు నావికులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఎదురుదాడికి దిగిన భద్రతా బలగాలు నౌకను విజయవంతంగా తమ ఆధీనంలోకి తీసుకుని 16 మంది అనుమానిత సముద్రపు దొంగలను అరెస్టు చేసినట్లు యూరోపియన్ యూనియన్ నౌకాదళం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!