

కేరళలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించిన 17 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి ఈ క్రీమ్‌ను కొనుగోలు చేసిన ఆమెకు చివరకు ప్రమాదకరమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మలప్పురానికి చెందిన బాలిక మొటిమలు, నల్ల మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్ తగ్గుతాయంటూ ప్రచారం చేసిన వీడియోలను చూసి, అందులో ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. మొదట్లో ఫలితాలు కనిపించడంతో దాదాపు ఏడాది పాటు పలుమార్లు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసి ఉపయోగించింది.
కొంతకాలానికి బాలికకు రక్తపోటు తగ్గడం, స్పృహ కోల్పోవడం, కాళ్లకు తీవ్రమైన వాపు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో శరీరంలో పాదరసం (మెర్క్యురీ) ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు, మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనే మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. క్రీమ్‌లో పాదరసం స్థాయి 12,500 పీపీఎం ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఉత్పత్తిపై ఫిర్యాదు చేసినా కంపెనీ నుంచి స్పందన రాలేదని బాలిక కుటుంబం ఆరోపించింది. సంస్థపై వినియోగదారుల కోర్టులో చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చర్మం తెల్లగా మారుతుందని, మచ్చలు తొలగిపోతాయని చెప్పే ఆన్‌లైన్ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని, చర్మ సమస్యలుంటే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!