

వేసవి కాలం మొదలైతే మార్కెట్లో పచ్చి మామిడి పండ్ల సందడి కనిపిస్తుంది. పుల్లగా, కారం కలిపి తింటే నోరూరించే ఈ పచ్చి మామిడి రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పచ్చి మామిడిని పరిమితంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో పచ్చి మామిడి రసం తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా ఎలక్ట్రోలైట్ల సమతుల్యత కూడా నిలకడగా ఉంటుంది. దీని వల్ల వడదెబ్బ ప్రమాదం తగ్గుతుంది.
తరచుగా మలబద్ధకం, గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా పచ్చి మామిడి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయం నుంచి పిత్త స్రావాన్ని పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో పచ్చి మామిడి కీలక పాత్ర పోషిస్తుంది.
పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. పండిన మామిడి పండ్లతో పోలిస్తే పచ్చి మామిడిలో చక్కెర, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా పచ్చి మామిడి ముక్కలను నమలడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం మరియు నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక : ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది వైద్య సలహాగా పరిగణించరాదు. ఆరోగ్యం లేదా ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!