

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వాటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 70 దేశాల నుంచి వచ్చే వెయ్యి మంది ప్రతినిధులకు తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా పరిచయం చేయడమే భారత్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని వివరించారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించడం లేదని ఆరోపించారు. గతంలో గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ రావడంపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ప్రశ్నించారు.
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి పన్ను రాయితీలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించిన కొందరికి తొలుత వీసాలు ఇచ్చి, ఆ తర్వాత నిలిపివేశారని కూడా ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తయిందని, త్వరలో మరిన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమ్మిట్ కోసం ప్రజాధనం ఖర్చు చేస్తున్నారన్న బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పథకం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించారు. మరోవైపు, విదేశాలకు వెళ్లడం, ఆత్మీయంగా పలకరించడం మాత్రమే విదేశాంగ విధానం కాదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కూడా దావోస్ తరహాలో రాజకీయ, ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చలకు వేదికగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!