

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, గిగ్ వర్కర్లతో ర్యాలీ, సంక్షేమ పథకం ప్రారంభోత్సవం, భారత్ సమిట్ 2026 ముగింపు కార్యక్రమం ఆయన పర్యటనలో భాగంగా ఉన్నాయి. రాహుల్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉదయం 9 గంటలకు హెచ్ఐసీసీలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ప్రపంచ ప్రజాస్వామ్య విలువలు, గ్లోబల్ సౌత్-గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సహకారంపై చర్చించనున్నారు. ఉదయం 9:45 గంటలకు అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులతో మరో సమావేశం ఉంటుంది. అనంతరం 10:30 గంటలకు హైటెక్ సిటీలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి ర్యాలీలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్స్‌లో జరిగే సభలో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. ఫుడ్ డెలివరీ సిబ్బంది, క్యాబ్, ఆటో డ్రైవర్లు వంటి ప్లాట్‌ఫారమ్ ఆధారిత కార్మికులకు బీమా, ప్రమాద రక్షణ, జీవనోపాధి భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. సాయంత్రం 3 గంటలకు హెచ్ఐసీసీలో జరిగే భారత్ సమిట్ 2026 ముగింపు సభకు హాజరై, సుమారు 70 దేశాల నుంచి వచ్చిన 1,000 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, విధాన నిర్ణేతలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!