

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన కరోనా వైరస్ మరో కొత్త రూపంలో వెలుగులోకి వచ్చింది. పీజే.2.1 అనే ఉపరకం పలు దేశాల్లో గుర్తించడంతో మరోసారి చర్చ మొదలైంది. జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్లో 2026 అక్టోబర్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఈ ఉపరకాన్ని తొలిసారిగా మే 2న కెనడాలోని అంటారియోలో గుర్తించారు. అనంతరం జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్‌లోనూ బయటపడింది. ప్రస్తుతం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో దీని ఉనికి నమోదైంది. ఈ వైరస్ ఉపరకంలోని ములుగు ప్రొటీన్‌లో పలు జన్యు మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మానవ కణాల్లోకి వైరస్ ప్రవేశించేందుకు ఉపయోగపడే ఏసీఈ2 గ్రాహకంతో ఇది మరింత సమర్థంగా బంధించే లక్షణాన్ని చూపించినట్లు ప్రయోగశాల అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, ఈ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
పీజే.2.1 సోకిన వారిలో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన లేదా రుచి కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే ఇవి ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలతోనూ పోలి ఉంటాయి కాబట్టి వైద్య పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం.. ఈ ఉపరకం శరీరంలోని ప్రతిరక్షక పదార్థాలను తప్పించుకునే సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు ఆధారాలు లేవు. అలాగే, తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాల ముప్పు పెరిగిందని నిరూపించే వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, పరిసరాల్లో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!