

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. సుజాతనగర్ వద్ద సుమారు 667 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిసింది. జిల్లాలోని పెనగడప, పాల్వంచ-దమ్మపేట, చాపరాలపల్లి, దుమ్ముగూడెం, సుజాతనగర్, సీతంపేట ప్రాంతాల్లో అధికారులు సర్వేలు నిర్వహించారు. భూమి లభ్యత, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, ఎత్తు పరిమితులు, అటవీ ప్రాంతాలు, వరద ముప్పు వంటి అంశాలను పరిశీలించి సుజాతనగర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతం ప్రధాన రహదారికి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు 5.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం 35.4 కిలోమీటర్లు, సింగరేణి ప్రాంతం 32.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సమీపంలోని అభయారణ్యం సుమారు 7.4 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. 1986, 2022లో సంభవించిన భారీ వరదల ప్రభావాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో భూసేకరణ, ఇతర అవసరమైన ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికే వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ప్రాజెక్టు కూడా రాష్ట్ర విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణలో భాగం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!