

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఏ వయసులో కుట్టించాలి, ఇన్ఫెక్షన్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహాలు తల్లిదండ్రుల్లో ఉంటాయి. వైద్యుల ప్రకారం వయసు ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదు. పరిశుభ్రత, సురక్షితమైన పద్ధతులు ఎంతో ముఖ్యం. కొందరు కుటుంబాలు పుట్టిన ఆరు నెలల్లోపే చెవులు కుట్టిస్తారు. అయితే చాలా చిన్న వయసులో ఇన్ఫెక్షన్ ముప్పు ఉండొచ్చని, బిడ్డ స్వయంగా కుట్టించిన ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకోలేడని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సుమారు ఏడాది వయసు వరకు వేచి ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
ఏ వయసులో చెవులు కుట్టించినా శిక్షణ పొందిన నిపుణుడితోనే, పూర్తిగా క్రిమిరహిత పరికరాలను ఉపయోగించి చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్, మచ్చల ముప్పును తగ్గించేందుకు పియర్సింగ్ గన్ కంటే శుభ్రమైన సూదిని ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కుట్టించిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా చెవులను తాకకూడదు. ఎర్రబడటం, వాపు, నొప్పి పెరగడం లేదా చీము రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
ముక్కు కుట్టించేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. పిల్లల ముక్కు సున్నితంగా ఉండటంతో పాటు చిన్నపిల్లలు తరచూ ముఖాన్ని, ముక్కును చేతులతో తాకుతుంటారు. దీంతో ఇన్ఫెక్షన్ ముప్పు పెరగవచ్చు. అందువల్ల పిల్లలు తమ పరిశుభ్రతను తామే పాటించగలిగే వయసు వచ్చే వరకు వేచి ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ముక్కు కుట్టించేందుకు 12 నుంచి 15 ఏళ్ల వయసు అనుకూలంగా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే సరైన పరిశుభ్రత, సురక్షిత పద్ధతులు పాటించడం తప్పనిసరి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, దీని ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు లేదా సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి, వారి సూచనలను పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!