

థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో చిన్నదైనా శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలను నియంత్రిస్తుంది. మెటబాలిజం, శరీర ఉష్ణోగ్రత, మూడ్, గుండె వేగం, శక్తి స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. కేవలం ఆహారం ద్వారా థైరాయిడ్ వ్యాధిని నయం చేయలేమని, కానీ అది థైరాయిడ్ పనితీరుపై మరియు మందుల ప్రభావంపై ప్రభావం చూపుతుందని ఎండోక్రినాలజిస్టు డాక్టర్ నందిని శంకర నారాయణ తెలిపారు.
థైరాయిడ్ ఆరోగ్యానికి అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలు చాలా అవసరం. అయోడిన్ ఉప్పు, పాలు, గుడ్లు, సముద్ర ఆహారాల్లో లభిస్తుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను యాక్టివేట్ చేయడంలో సహాయపడుతుంది. జింక్ పప్పులు, గింజలు, శనగలు, టోఫు వంటి ఆహారాల్లో ఉంటుంది.
బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలపై సోషల్ మీడియాలో ఉన్న భయాలు అపోహలేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఉడికించి మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. నిజమైన సమస్య అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల వస్తుందని, అది అలసట, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుందని తెలిపారు.
థైరాయిడ్ మందులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేసుకోవాలని, 30–60 నిమిషాల తర్వాతే టీ లేదా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోయా, ఐరన్, క్యాల్షియం సప్లిమెంట్లు మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
థైరాయిడ్‌ను నయం చేసే ప్రత్యేక డైట్ లేదా డిటాక్స్ లేదని, సమతుల్య ఆహారం, వైద్య పర్యవేక్షణ, అపోహలను నమ్మకపోవడమే ఆరోగ్యానికి సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: రక్తహీనత తీవ్రంగా ఉన్నవారు స్వయంగా మందులు వాడకుండా ముందుగా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!