

మన శరీరంలోని వ్యర్థాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియకు నీరు అవసరమే కాబట్టి ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు శుభ్రపడతాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. నీరు కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తుందే తప్ప ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలను మళ్లీ పూర్వస్థితికి తీసుకురాలదు. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులు కూడా నయం అవుతాయని వైరల్ అవుతున్న వార్తలపై డాక్టర్లు అప్రమత్తం చేస్తున్నారు. వైద్యుల ప్రకారం కిడ్నీ సమస్యలు సాధారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లు లేదా జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. ఒకసారి కిడ్నీలోని ఫిల్టర్లు దెబ్బతింటే కేవలం నీరు తాగడం ద్వారా అవి తిరిగి సరిచేయలేమని చెబుతున్నారు. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అతిగా నీళ్లు తాగితే శరీరంలో వాపులు, రక్తపోటు పెరగడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు సుమారు 2–3 లీటర్ల ద్రవాలు తీసుకోవచ్చు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది వైద్య సలహాగా పరిగణించరాదు. ఆరోగ్యం లేదా ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!