

గోపీచంద్ ‘యజ్ఞం’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవడంతో ఆయన మార్కెట్ కొంత ప్రభావితమైంది. ‘పక్కా కమర్షియల్’, ‘విశ్వం’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో గోపీచంద్ వెండితెరకు దూరమై రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన అభిమానుల్లో కొత్త సినిమా కోసం ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ చేతిలో ‘భరతవర్ష’, ‘సింగ’ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు బడ్జెట్ అంచనాలు, ఓటీటీ వ్యాపారం నెమ్మదించడం వంటి కారణాలతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 7వ శతాబ్దపు నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘భరతవర్ష’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ పాత్ర, కథాంశం ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకొస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. సరైన మాస్ కథ పడితే గోపీచంద్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలను త్వరగా మొదలుపెట్టి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గోపీచంద్ కూడా వరుస విజయాలతో తిరిగి తన మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!