

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వత్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ సెట్స్ నుంచి ఒక ఆసక్తికరమైన బిహైండ్-ది-సీన్స్ వీడియో క్లిప్‌ను ఆయన పంచుకున్నారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్, నటి రాశి ఖన్నాతో ముచ్చటిస్తూ కనిపించారు. "ధర్మన్ మూడో షెడ్యూల్ కోసం మళ్లీ తలైవర్‌తో కలిశాను" అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే సెప్టెంబర్ 4న ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. రజనీకాంత్ ఒక సీనియర్ మెడికల్ ఫ్యాకల్టీగా జూనియర్ డాక్టర్లకు పాఠాలు చెబుతున్న సన్నివేశాలతో కూడిన వీడియోను విడుదల చేసింది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్ నిర్మాణంలో రజనీ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ధర్మమే గెలుస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక వైద్యుడి పాత్రలో నటిస్తూనే, సమాజంలోని నేరస్థులను శిక్షించే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో విడుదలైన టైటిల్ పోస్టర్‌లో ఆపరేషన్ థియేటర్‌లో స్కాల్‌పెల్ చేతిలో పట్టుకుని, ఒక రౌడీ మృతదేహంపై కాలు వేసి ఉన్న రజనీకాంత్ లుక్ సినిమాపై ఉత్కంఠను మరింత పెంచింది. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుస షెడ్యూళ్లతో సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!