

దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘మాన్‌స్టర్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో విదేశీ షెడ్యూల్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ స్వామి, రోనిత్ రాయ్, సీమా బిస్వాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, సల్మాన్ ఖాన్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్, దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ‘మాన్‌స్టర్’ బిజినెస్‌కు సంబంధించి రూ.100 కోట్ల భారీ డీల్ జరిగిందనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది. ఆల్ ఇండియా థియేట్రికల్ హక్కులను పీవీఆర్ ఐనాక్స్ రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఒప్పందం రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో కుదిరిందనే సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘మాన్‌స్టర్’ను 2027 ఈద్ సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!