

జామి మండలం మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆర్మీ మాజీ ఉద్యోగి సుధాకర్, సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె అయిన రాధా గాయత్రి గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకుని భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ నెల 21, 22 తేదీల్లో స్వగ్రామంలో నిర్వహించనున్న వ్రతాలు, పూజా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బుధవారానికల్లా ఇంటికి చేరుకుంటానని తల్లిదండ్రులకు ఆనందంగా చెప్పిన ఆమె, అనూహ్యంగా మృతదేహంగా స్వగ్రామానికి చేరుకోవడం అందరినీ కలచివేసింది.
చదువులో ఎప్పుడూ ముందుండే రాధా గాయత్రి పెందుర్తిలో పాఠశాల విద్య పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.కామ్, ఎంబీఏ చదివింది. అనంతరం సోషియాలజీలో పీహెచ్డీ పూర్తి చేసి క్యాంపస్ నియామకాల ద్వారా ఢిల్లీలో ఉద్యోగం సాధించింది. చదువు పట్ల అపారమైన ఆసక్తి కలిగిన ఆమె భవిష్యత్తులో సీఏ చదవాలని కూడా ఆకాంక్షించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఆమె అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించగా, గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!