

సింగరేణి సంస్థను బీఎస్‌ఎన్‌ఎల్ తరహాలో నిర్వీర్యం కానివ్వబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా బంగారం, లిథియం వంటి ఖనిజాల మైనింగ్‌లోకి విస్తరించి లాభాల బాటలో నడిపిస్తామని తెలిపారు. ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం సచివాలయంలో సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు భట్టిని సన్మానించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కార్మిక సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. సింగరేణిని భవిష్యత్ తరాలకు లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లు తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సంస్థకు నష్టం జరిగిందని భట్టి విమర్శించారు. సింగరేణి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నైని, తాడిచర్ల-2, మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్-2 వంటి బొగ్గు బ్లాక్‌లను సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ఒడిశాలోని నైని బ్లాక్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి రాష్ట్రానికి గర్వకారణమైన సంస్థ అని, కొత్త గనులు, వ్యాపార విస్తరణ, నూతన ప్రాజెక్టులతో సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్‌లో సింగరేణిని దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!