

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంధారి’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిన ఈ చిత్రంలో తన కుమార్తె కిడ్నాప్ తర్వాత ఆమెను వెతికే తల్లి కథను చూపిస్తున్నారు. అయితే ఈ కథ, టైటిల్ తన రచనను పోలి ఉన్నాయని రచయిత కళ్యాణ్ బండి ఆరోపిస్తున్నారు. 2019లోనే ‘గాంధారి’ పేరుతో కథ రాసి స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో నమోదు చేయించానని ఆయన చెబుతున్నారు. పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి బిడ్డను రక్షించే తల్లి పోరాటమే తన కథాంశమని వెల్లడించారు. తన కథను అప్పట్లో వూట్, హర్మన్ బావేజా స్టూడియో, జియో హాట్‌స్టార్ సంస్థలకు పంపినట్లు తెలిపారు. 2025లో ‘గాంధారి’ ప్రకటన చూసిన తర్వాత పోలికలు గుర్తించానని పేర్కొన్నారు.
కథను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ న్యాయపరమైన నోటీసు పంపి సుమారు రూ.40 లక్షల పరిహారం కోరినట్లు కళ్యాణ్ తెలిపారు. అయితే డబ్బు కంటే తన రచనకు గుర్తింపు, క్రెడిట్ కావడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కథా పిక్చర్స్ ఈ ఆరోపణలను ఖండించింది. ‘గాంధారి’ పూర్తిగా స్వతంత్రంగా రూపొందిన ఒరిజినల్ కథ అని, కథ, స్క్రీన్‌ప్లేను కనికా ధిల్లాన్ రాశారని సంస్థ పేర్కొంది. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా చుట్టూ ఆసక్తి పెరిగింది. నిజంగా రెండు కథల మధ్య ఎంత పోలిక ఉంది? టైటిల్ విషయంలో ఎవరి వాదనకు బలం ఉంది? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఆధారాలు బయటకు వస్తేనే వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!