

అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేసే భారత నావికులకు కేంద్ర విదేశాంగ శాఖ నల్ల సముద్రంపై ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని పేర్కొంటూ, అక్కడ పనిచేయడానికి లేదా ప్రయాణించడానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్లోని ఒడెసా తీరంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ చేయబడింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారని, మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఈ ప్రాంతంలో క్షిపణి మరియు డ్రోన్ దాడులు తరచూ జరుగుతున్నాయని తెలిపింది.
ఏప్రిల్ 2026 నుంచి నల్ల సముద్ర మార్గాల్లో జరిగిన దాడుల కారణంగా ఇప్పటికే ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ వెల్లడించింది. నావికులు ఉద్యోగాలను అంగీకరించే ముందు ప్రమాదాలను సవివరంగా అంచనా వేయాలని, భద్రతా ఏర్పాట్లు, బీమా సదుపాయాలు, అత్యవసర విధానాలు, ఉద్యోగ నిబంధనలను సరిచూసుకోవాలని సూచించింది. కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, సముద్రయాన అధికారుల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో సమీప భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!