

విశాఖపట్నానికి చెందిన ప్రముఖ అనస్థీషియా వైద్యురాలు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఎం. సృజనా దేవి ప్రతిష్ఠాత్మకమైన ‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ టైటిల్‌ను గెలుచుకుని నగరానికి ఘనత తీసుకొచ్చారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఫరెవర్ స్టార్ ఇండియా (FSIA) నిర్వహించిన జాతీయ స్థాయి గ్రాండ్ ఫైనల్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న వేలాది మంది పోటీదారులను అధిగమించి ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
విశాఖపట్నం పర్యటనలో భాగంగా డాక్టర్ సృజనా దేవి రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా ఇప్పటికే సమాజంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ సృజనా దేవి, మోడలింగ్, ఫ్యాషన్ రంగాల్లోనూ జాతీయ స్థాయిలో కిరీటం గెలుచుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ అద్భుత విజయాలు సాధించడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో డాక్టర్ సృజనా దేవి మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!