

విజయవాడ రైల్వే డివిజన్‌లో అరుదైన ‘రైల్ ఓవర్ రైల్ (ROR)’ బైపాస్ రూపుదిద్దుకుంటోంది. ఒక రైల్వే లైన్‌ను మరో లైన్ దాటే ప్రాంతంలో సాధారణ లెవల్ క్రాసింగ్‌కు బదులుగా.. ఒక మార్గాన్ని మరో మార్గం పైనుంచి తీసుకెళ్లేలా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. రాయనపాడు–ముస్తాబాద మధ్య 22 కి.మీ మేర ఈ బైపాస్ మార్గాన్ని సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులు అనుకున్న విధంగా పూర్తయితే ఈ ఏడాది చివరి నాటికి మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో సరకు రైళ్ల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే ఈ బైపాస్ ప్రధాన లక్ష్యం. ఖాజీపేట, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను విజయవాడ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించనున్నారు. దీంతో సరకు రవాణా మరింత సులభతరం కానుంది.
మొత్తం 22 కి.మీ మార్గాన్ని మూడు విభాగాలుగా చేపట్టారు. రాయనపాడు–విజయవాడ నార్త్, ఈస్ట్ క్యాబిన్‌ల మధ్య 10 కి.మీ మార్గం ఒక విభాగంగా ఉంది. విజయవాడ నార్త్, ఈస్ట్ క్యాబిన్–గుణదల మధ్య 6 కి.మీ మార్గం 2023లోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది బైపాస్‌లో కీలక భాగంగా పనిచేస్తోంది. గుణదల–ముస్తాబాద మధ్య మరో 6 కి.మీ మార్గం నిర్మాణంలో ఉంది. ఈ మూడు విభాగాలు పూర్తిస్థాయిలో అనుసంధానమైతే రాయనపాడు నుంచి ముస్తాబాద వరకు ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. బైపాస్ పూర్తయితే రాయనపాడు, గుణదల స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు సరకు రవాణా సామర్థ్యం, డివిజన్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!