

రష్యా నుంచి చమురు, సహజ వాయువు వంటి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే ‘శాంక్షనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. 262-159 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పటికే సెనెట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది.
దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ బిల్లు ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులతో పాటు ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును తరలించే నౌకలపై కఠిన చర్యలకు ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ఇరాన్ ఇంధన, ఆయుధ రంగాలకు నిధులు అందకుండా ఉన్న ఆంక్షలను 2031 వరకు పొడిగించే నిబంధనలు కూడా ఉన్నాయి.
రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు పెనాల్టీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది. రష్యా చమురు కొనుగోళ్లలో చైనా, భారత్ కీలక దేశాలుగా ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారి, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అదనపు సుంకాల ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!