

అమెరికా వీసా విధానంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు ఫెడరల్ కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడింది. విదేశీ విద్యార్థులు, మార్పిడి సందర్శకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలపరిమితిని తగ్గించేలా రూపొందించిన నిబంధన అమలును మసాచుసెట్స్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ నిలిపివేశారు. మంగళవారం నుంచి నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా.. ఒక రోజు ముందే సోమవారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని తీసుకురావడానికి హోంల్యాండ్ భద్రతా శాఖ చూపిన కారణాలు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
జూలైలో హోంల్యాండ్ భద్రతా శాఖ తీసుకొచ్చిన నిబంధన ప్రకారం విదేశీ విద్యార్థుల ఎఫ్ వీసాలు, మార్పిడి సందర్శకుల జే వీసాలకు గరిష్ఠంగా నాలుగేళ్ల కాలపరిమితి, విదేశీ జర్నలిస్టుల ఐ వీసాలకు 240 రోజుల పరిమితి విధించాలని ప్రతిపాదించారు. చైనా జర్నలిస్టులకు 90 రోజుల పరిమితి ఉండేది. గడువు ముగిసిన తర్వాత అమెరికాలో కొనసాగాలంటే మళ్లీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘స్థితి కాలపరిమితి’ విధానాన్ని ఈ కొత్త నిబంధన భర్తీ చేయాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలతో కొత్త నిబంధన అమలు తాత్కాలికంగా నిలిచిపోయి, ప్రస్తుతం పాత విధానమే కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!