

వైద్య పరీక్షల కోసం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చిన విచారణ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారవడం కలకలం రేపింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్ సిద్దిపేట, చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆటోలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జులై 15న అతడిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని సిద్దిపేట జిల్లా కారాగారానికి తరలించారు. శనివారం ఏఆర్ ఎస్సై ఒడ్డన్నతో పాటు తొమ్మిది మంది పోలీసు సిబ్బంది ఏడుగురు విచారణ ఖైదీలను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. నలుగురికి పరీక్షలు పూర్తికావడంతో వారిని తిరిగి పోలీసు వాహనంలో కూర్చోబెట్టగా, సాయికుమార్‌ను మరో ఖైదీతో కలిపి బేడీలు వేశారు.
మిగిలిన ఖైదీలకు వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో సాయికుమార్ తనతో బేడీలు వేసి ఉన్న సహఖైదీని బెదిరించి, బలవంతంగా చేతిని విడిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసు వాహనంలోని అత్యవసర ద్వారం నుంచి దూకి సమీపంలోని సందుల గుండా పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తుండగా, పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఏఆర్ ఎస్సై ఒడ్డన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసుల పహారాలో ఉన్న ఖైదీ తప్పించుకోవడంతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!