

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల్లోనే 80 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుండటంతో వారికి అందించే సేవలను మరింత మెరుగుపర్చేందుకు శ్రీవారి సేవకుల పనితీరును అంచనా వేసే కొత్త గ్రేడింగ్ విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు సుమారు 3,000 నుంచి 3,500 మంది శ్రీవారి సేవకులు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.
కొత్త విధానంలో సేవకుల హాజరు, పనితీరు, భక్తులను పలకరించే తీరు, వారికి అందించే సేవలను పర్యవేక్షించి గ్రేడింగ్ ఇవ్వనున్నారు. అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడంతో పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించే వారికి ‘అత్యుత్తమం’, విధులను సక్రమంగా నిర్వహించే వారికి ‘ఉత్తమం’, అప్పగించిన పనిని సరిగా నిర్వహించని వారికి తక్కువ గ్రేడ్ ఇవ్వనున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్ పొందిన బృందాలను బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో సేవలకు వినియోగించుకోనున్నారు.
సేవకుల పనితీరును పర్యవేక్షించేందుకు టీటీడీ ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లను కూడా నియమించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన గెజిటెడ్ అధికారులు, ఆపై స్థాయి అధికారులు, ప్రముఖ సంస్థలు, బ్యాంకుల్లో ఉన్నత హోదాల్లో పనిచేసినవారిని ఇందుకోసం ఎంపిక చేశారు. నెలకు ఐదుగురు ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఒక్కొక్కరి కింద 10 నుంచి 15 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు ఉంటారు. వీరు రోజువారీ పనితీరు వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు.
గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారిని గ్రూప్ సూపర్‌వైజర్లుగా ఎంపిక చేస్తున్నారు. వీరు 15 రోజుల పాటు విధుల్లో ఉంటారు. ఒక్కో గ్రూప్ సూపర్‌వైజర్ 10 నుంచి 15 శ్రీవారి సేవకుల బృందాలను పర్యవేక్షిస్తారు. ఒక్కో బృందంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. సేవకుల హాజరు, పనితీరు, భక్తులతో వ్యవహరించే తీరును పరిశీలించి ప్రతిరోజూ యాప్‌లో వివరాలను నమోదు చేసి ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లకు అందజేస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!