

మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి తన వివరణను సమర్పించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ పంపిన ఆమె.. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన వాదనను స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారని సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. తన స్వస్థలమైన గీసుకొండతో కుమార్తె సుస్మితకు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడ నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు. ఆ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, కుటుంబ సంబంధాల కారణంగా వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని చెబుతూ.. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!