

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కల్తీ నెయ్యి తయారీలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామోలిన్, ఇతర రసాయనాలను ఉపయోగించినట్లు గుర్తించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్టు చేసింది.
ఇక నెయ్యిలో జంతు కొవ్వు ఉందన్న గత ఆరోపణలపై కూడా తాజా దర్యాప్తు వివరాలు చర్చకు దారితీశాయి. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై వచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ప్రయోగశాల పరీక్షల్లో సింథటిక్ పదార్థాలు, వృక్ష ఆధారిత నూనెలతో తయారు చేసిన నెయ్యి గుర్తించినట్లు పేర్కొన్నారని సమాచారం. అయితే మరోవైపు దర్యాప్తుకు సంబంధించిన కోర్టు రికార్డుల్లో కొన్ని సరఫరా చేసిన నెయ్యి లోడ్లలో వృక్ష, జంతు కొవ్వు ఆధారిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో జంతు కొవ్వు అంశంపై భిన్నమైన దర్యాప్తు వివరాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!