

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను తమ ప్రభుత్వం ప్రజాస్వామికంగా నిర్వహించిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో చర్చించామని చెప్పారు. స్పీకర్ ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించారని, శాసనసభ్యులంతా వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొన్నారని వివరించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 51 గంటల 52 నిమిషాలు కొనసాగాయని తెలిపారు. 50 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయని, 86 మంది సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడిగారని, 105 మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు ప్రకటనలు చేశారని, పలు బిల్లులు ఆమోదించడంతో పాటు స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయని వివరించారు.
అసెంబ్లీ కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అంతరాయం కలిగించారని శ్రీధర్ బాబు విమర్శించారు. సభా నియమాలను ఉల్లంఘిస్తూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారని ఆరోపించారు. పలు రోజుల నిరసనల అనంతరం 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అలాగే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా శాసనమండలి నుంచి సస్పెండ్ చేశారు. 22-ఏ భూముల అంశంపై ప్రభుత్వం సభలో చర్చకు ముందుకొచ్చిందని, సమస్యల పరిష్కారానికి హైపవర్ అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని శ్రీధర్ బాబు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరై తన అనుభవంతో సూచనలు ఇస్తారని ఆశించామని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!